Monday, August 20, 2018

జ్ఞాపకాల సుడిగుండాలు

శిధిలమైన కలల శౌధం వదలనంటె  హృదయం
మార్చలేని ఆ గతం మరువ లేకున్న
జ్ఞాపకాల సుడిగుండాలు ఎదను పట్టి లాగుతుంటే 
వర్షించే నా మనస్సును దాచలేకున్న   
నీతో తిరిగిన ప్రతీ చోటు నను వంటరినంటుంటే
తీరమెరుగని నా పయనం ఎటువైపో మరి
కడవరకు నీ తోడుంట అని చేసిన బాస నను ప్రశ్నిస్తుంటే
మదిలోని ఆ వసంతం కనుమరుగై పోయెనే  

Tuesday, November 18, 2014

మనస్సు ప్రేమిస్తూనే ఉంటుంది

ధరణిని దాట లేనని తెలిసినా కెరటం ఆనందంతో ఎగిసి పడుతుంది
     తననే నమ్మిన నావను గమ్యం చేరుస్తుంది కనుక
చినుకై రాలిపోతానని తెలిసినా మేఘం గర్వంతో గర్జిస్తుంది
     తన చినుకులు పంట చేలకు తెచ్చిన వన్నెని చూస్తుంది కనుక
వాడి రాలిపోతానని తెలిసినా పుష్పం అందంగా విరబూస్తుంది
     తన సొగస్సు తనూలత పెదవులపై దరహాసాన్ని తెస్తుంది కనుక
మరణిస్తానని తెలిసినా జీవి కేరింతలు కొడుతూ జన్మిస్తుంది
     తన చివరి స్వాసదాకా మమతల మధురిమ ఆస్వాదిస్తుంది కనుక 
మోసపోతావని వివరం తెలిపినా మనస్సు ప్రేమిస్తూనే ఉంటుంది
     నిస్వార్ధంగా ప్రేమించే మనస్సు తనని మోసగించదని నమ్ముతుంది కనుక !!!

Monday, December 31, 2012

తరుణి తపము ఫలించునా

యుగ యుగాలకు చెరగని చరిత్ర ఇది
తర తరాలకు మారని తరుణమిది

మనస్సు లేని మనువైనా, మగనికి భార్యలు మెండైనా
రాజ్యాల నడుమ సంధి కుదిర్చే రాయబారైనది రాకుమారి
హేమంతులు, సామంతులు, భూపాలులు, రారాజులు
రక్షకులు ఎందరున్నా రక్షించే వారెవరు ?

రాచరికానికి స్వస్తి చెప్పి రాజ్యాంగం రాశారు  
ఇంటనున్న ఇంతిని, అంగట్లో అమ్మారు
కాటికి కాలు చాపిన కామాంధుని సతియినది
బాల వితంతువై, పతికి పేర్చిన చితితో  కాలే కట్టైనది

కన్యా విక్రయం తగదని చాటారు, సతీసహగమనం ఘోరమని తెలిపారు
సంఘసంస్కర్తలెందరో సాంఘిక దురాచారాలను రూపుమాపారు   
దేశం అభివృధి వైపు పరుగులు తీసింది
మగువ హింసాచరిత్ర కొత్త వన్నెలు దిద్దుకుంది
    
పురిటిలోనే పసి పాపలను చంపటం నేర్చారు
ఆడపిల్లని చదువుకు అనర్హమని తేల్చారు
కన్నె పిల్లల జీవితాలను కాలసర్పమై కాటువేసారు  
వరకట్నం ఆవహించి సతీ దహనం చేసారు

లోకం తెలియని పసిపాపైనా
ఆడేపాడే చిన్నరి బాలికైనా
పదహరణాల పడుచు పిల్లైనా
మెట్టినింట అడుగుపెట్టిన నవవధువైనా

తరం ఏదైనా తరుణి తపము ఫలించునా ???
దశాబ్దాలెన్నైనా  కోమలి కష్టం తీరునా ???
గ్రహాలు మారినా పట్టిన గ్రహణం వీడునా???

Thursday, November 8, 2012

ప్రేమ

మనస్సు భాషా ప్రేమ 
మైమరపు పేరే ప్రేమ
ఎవరెరుగని ఓ మైకమా 

సంతోషాల నెలవె ప్రేమ
సుడిగుండాల కొలువె ప్రేమ
చీకటి వెలుగులకిది సరిగమ

కరునించే వరమె ప్రేమ
శిక్షించే శరమే ప్రేమ
ఊహకందని త్రిశంకుస్వర్గమా 

Monday, June 18, 2012

నలుపు

వధువు బుగ్గన చుక్కై దిష్టి తీస్తుంది నలుపు
మగువ కంటి కాటుకై సొగసు నింపుతుంది నలుపు
కొంటె కృష్ణుని మేనినంటి పూజలందుకుంటుంది నలుపు
రాతిరికి రారాజై ఆకాశానికి చీరకడుతుంది నలుపు
తనూలత తనువుపైన తుమ్మెదరెక్కల్లాంటి కురులై ఊయలూగుతుంది నలుపు
తెల్లని కాగితంపై పేర్చిన అక్షరాలతో అందమైన భావాలల్లుతుంది నలుపు
గగన వీధుల్లోన కారుమబ్బై కమ్మి వర్షపు జల్లు కురిపిస్తుంది నలుపు
కంటి పాపై కమ్మని కలల కబుర్లు వింటుంది నలుపు
అందమైన ఈ నలుపు నా శరీర వర్ణమై అనాకారిలా మిగిలిపోయింది