Monday, December 31, 2012

తరుణి తపము ఫలించునా

యుగ యుగాలకు చెరగని చరిత్ర ఇది
తర తరాలకు మారని తరుణమిది

మనస్సు లేని మనువైనా, మగనికి భార్యలు మెండైనా
రాజ్యాల నడుమ సంధి కుదిర్చే రాయబారైనది రాకుమారి
హేమంతులు, సామంతులు, భూపాలులు, రారాజులు
రక్షకులు ఎందరున్నా రక్షించే వారెవరు ?

రాచరికానికి స్వస్తి చెప్పి రాజ్యాంగం రాశారు  
ఇంటనున్న ఇంతిని, అంగట్లో అమ్మారు
కాటికి కాలు చాపిన కామాంధుని సతియినది
బాల వితంతువై, పతికి పేర్చిన చితితో  కాలే కట్టైనది

కన్యా విక్రయం తగదని చాటారు, సతీసహగమనం ఘోరమని తెలిపారు
సంఘసంస్కర్తలెందరో సాంఘిక దురాచారాలను రూపుమాపారు   
దేశం అభివృధి వైపు పరుగులు తీసింది
మగువ హింసాచరిత్ర కొత్త వన్నెలు దిద్దుకుంది
    
పురిటిలోనే పసి పాపలను చంపటం నేర్చారు
ఆడపిల్లని చదువుకు అనర్హమని తేల్చారు
కన్నె పిల్లల జీవితాలను కాలసర్పమై కాటువేసారు  
వరకట్నం ఆవహించి సతీ దహనం చేసారు

లోకం తెలియని పసిపాపైనా
ఆడేపాడే చిన్నరి బాలికైనా
పదహరణాల పడుచు పిల్లైనా
మెట్టినింట అడుగుపెట్టిన నవవధువైనా

తరం ఏదైనా తరుణి తపము ఫలించునా ???
దశాబ్దాలెన్నైనా  కోమలి కష్టం తీరునా ???
గ్రహాలు మారినా పట్టిన గ్రహణం వీడునా???